||సుందరకాండ ||

||ముప్పది ఏడవ సర్గ తెలుగులో||


||ఓమ్ తత్ సత్||
సీతా తద్వచనం శ్రుత్వా పూర్ణచంద్ర నిభాననా|
హనూమంత మువాచేదం ధర్మార్థసహితం వచః||1||

స|| సీతా పూర్ణచంద్ర నిభాననా ధర్మార్థసహితం తద్వచనం శ్రుత్వా హనుమంతం ఇదం వచః ఉవాచ||
తా||పూర్ణచంద్రుని పోలిన ముఖము కల సీతా ధర్మము అర్థము కలిగియున్న ఆ వచనములను విని హనుమంతునితో ఇట్లు పలికెను
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ సప్తత్రింశస్సర్గః

పూర్ణచంద్రుని పోలిన ముఖము కల సీతా ధర్మము అర్థము కలిగియున్న ఆ హనుమంతుని వచనములను విని, మరల హనుమంతునితో ఇట్లు పలికెను.

' ఓ వానరా ! నీవు చెప్పినట్లు రాముడు ఇంకొక అలోచనలేకుండా శోకములో మునిగి యున్నాడు అన్నమాట విషముతో కూడిన అమృతములా ఉన్నది. పురుషుని తాడుతో కట్టి అత్యంత ఐశ్వర్యమునకో దారుణమైన వ్యసనములకో విధి తీసుకుపోవును. ఓ ప్లవగోత్తమా ! విధి నిజముగనే బలీయము. వ్యసనపరంపరలలో పడిన లక్ష్మణుని రాముని నన్నూ చూడుము. నౌకాభంగమువలన సాగరములో నున్నవానివలే శోకసాగరములో నున్న రాముడు, ఆ సాగరపు అవతలి తీరము ఎప్పుడు చేరును? ఎప్పుడు రాక్షసులను వధించి రావణుని హతమార్చి లంకను నాశనము చేసి నన్ను నా పతిదేవుడు చూచును?

' రాముడు ఈ సంవత్సరకాలము పూర్తి కాకుండా త్వరగా రావలెను అని ఆయనకి చెప్పవలయును. నా జీవితము అంతవరకే. ఓ ప్లవంగమ దురాత్ముడగు రావణుని చేత పెట్టబడిన గడువులో ఇది పదవ మాసము గడుచుచున్నది. మిగిలినవి రెండే మాసములు. తమ్ముడగు విభీషణుడు నన్ను రామునకు అప్పగించవలనను ప్రయత్నములో ఉన్నవాడు. అది రావణుని బుద్ధిలోకి రాలేదు. నన్నుతిరిగి అప్పగించుట రావణునికి ఇష్టము లేదు. కాలవశమైన రావణుడు యుద్ధములో మృత్యువు కోరుకొనుచున్నాడు. ఓ వానరా అనలా అను పేరుగల విభీషణుని కుమార్తె తల్లి ప్రోత్సాహముతో స్వయముగా నాకు ఇది చెప్పెను'.

'ఓ వానరశ్రేష్ఠుడా ! నాపతి తప్పక నన్ను చేరుకొనును. నా పవిత్రమైన అంతరాత్మ రామునిలోని అనేకమైన గుణములను ఎరుగును. ఓ వానరా ! రాఘవునిలో ఉత్సాహము పౌరుషము సత్త్వము ధైర్యసాహసములు కృతజ్ఞత పరాక్రమము సౌజన్యము కలవు. ఎవరు జనస్థానములో తమ్ముని సహాయము లేకుండా పదునాలుగువేల రాక్షసులను హతమార్చెనో అట్టి వాడు ఇంక ఎవరిని జయించలేడు? ఆ పురుషర్షభుడు వ్యధలతో కలత చెందడు. పులోమజ ఇంద్రుని ప్రభావముఎరిగి నట్లు నాకు ఆయన ప్రభావము తెలుసు. ఓ వానరా ! శూరుడైన రాముడు సూర్యునికిరణమువంటి శర జాలముతో శత్రువులైన రాక్షస సమూహములనే జలరాశిని ఎండింపచేస్తాడు'.

అప్పుడు రాముని కొఱకై శోకములో మునిగియున్నఅశ్రువులతో నిండిన కళ్ళు గల ఆ సీతతో, ఆ వానరుడు ఇట్లు పలికెను.

' రాఘవుడు నా మాటలు వినినవెంటనే వానర భల్లూక గణములతో కూడిన మహత్తరమైన సైన్యముతో ఇచటికి వచ్చును. ఓ వరాననా ! లేకపోతే ఇప్పుడే ఈ దుఃఖమునుంచి నిన్ను విడిపింపగలను. ఓ దోషములేనిదానా నీవు నా వీపుని అధిరోహించుము. నిన్ను నా వీపు మీద కూర్చొన బెట్టుకుని సాగరమును దాటెదను. నాకు రావణునితో సహా లంకను మోసుకుపోగల శక్తి వున్నది. ఓ మైథిలీ అగ్ని ఇంద్రునకు హవ్యము తీసుకుపోవునట్లు నేను నిన్ను ప్రశ్రవణ పర్వతముపై నున్నవాని వద్దకు ఈ దినమే చేర్చగలను.
ఓ వైదేహీ దైత్యులవధకు సంసిద్ధుడైన విష్ణువు వలె లక్ష్మణునితో కూడిన రాముని ఈ దినమే చూచెదవు. ఐరావతము పై నున్న పురందరుని వలె నీదర్శనముకై ఉత్సాహముతో వారు ఆశ్రమములో నున్న వారు'.

' ఓ దేవీ నా పృష్ఠము ఆరోహించుము. ఓ శోభనే సంకోచము వలదు. రోహిణి శశాంకుని పొందినట్లు నీవు రామునిపొందుటకు కృతనిశ్చయురాలివి కమ్ము. నీవు నా పృష్ఠము ఆరోహించి చంద్రుడు సూర్యులతో సంభాషించునట్లు ఆకాశమార్గములో పయనిస్తూ మహాసముద్రమును దాటుము. ఓ దేవీ నిన్ను ఇచటి నుంచి తీసుకుపోవునప్పుడు నన్ను అనుసరించి రాగల శక్తి కలవారు ఈ లంకానగరములో లేరు. ఓ వైదేహీ నేను ఇక్కడికి వచ్చిన విధముగనే నిన్ను సునాయాసముగా తోడ్కొని పోవగలను'.

మైథిలి వానరశ్రేష్ఠుని ఆ అద్భుత వచనములను విని సంతోషముతో పులకితురాలై హనుమంతునితో ఇట్లు పలికెను. ' ఓ హనుమా నన్ను అంత దూరము ఏట్లు తీసుకుపోగలవు. ఓ వానర సేనానీ ఇదే నీ వానర లక్షనమునకు నిదర్శనము. ఓ వానరర్షభ ఇంత చిన్న శరీరము కల నీవు నన్ను ఇక్కడినుంచి నా భర్త మానవేంద్రుడు అగు రాముని వద్దకు ఏట్లు తీసుకుపోయెదవు?'

అపరిమిత బలసంపన్నుడూ మారుతాత్మజుడూ అగు హనుమంతుడు సీతాదేవి యొక్క మాటలను విని తనకు ఇది కొత్త పరాభవమని చింతించెను. ' ఈ అసితేక్షణకి నా ప్రభావము శక్తి తెలియదు. అందువలన నేను పోందగల రూపము ఈ వైదేహికి చూపెదను'. ఈ విధముగా అలోచించి అప్పుడు శత్రువులను మర్దించగల ప్లవగోత్తముడు వైదేహికి తన నిజ స్వరూపము చూపసాగెను.

ధీమంతుడైన వానరుడు ఆ వృక్షమునుండి పక్కకు జరిగి, సీత యొక్క నమ్మకము పెంపొందించుటకై తన శరీర ప్రమాణము పెంచసాగెను, ఆవానరుడు మేరు మందరపర్వత సమానముగా ప్రజ్వలిస్తున్న అగ్నితో సమానమైన తేజస్సు కలవాడయ్యెను. అప్పుడు సీతా దేవి ముందర నిలచెను. అప్పుడు పర్వతముతో సమానమైన రూపముగల ఎర్రని ముఖముకల వజ్రమువంటి దంతములు నఖములు కల భయము కలగించు రూపము గల మహాబలుడు అగు ఆ హనుమానుడు వైదేహి తో ఇట్లు పలికెను.

' ఈ పర్వతములు వనములు కల కోటబురుజులు ప్రాకారములు గల ఈ లంకను దాని ప్రభువుతో సహా పెకలించి తీసుకు పోవు శక్తి నాలో కలదు. ఓ దేవీ! నీ శంకలను వీడుము. నీ మనస్సును కుదుటపరచుకొనుము. ఓ వైదేహీ! లక్ష్మణుని తో కూడిన రాముని శోకములేని వాడిగా చేయుము'.

పద్మపత్రములవంటి విశాలమైన కన్నులు గల జనకాత్మజ సీత ఆ భయంకరమైన రూపము గల మారుతియొక్క ఔరసపుత్రుని చూచి ఇట్లు పలికెను.

' ఓ మహాకపి నీ బలము సత్త్వము వాయువు వలె కల నీ వేగము అగ్నివలె కల నీ అద్భుత తేజము తెలిసికొనుచున్నాను. ఓ వానరపుంగవ !ఈ ఊహకు అందని అప్రమేయమైన సాగరమును దాటి ఈ భూమికి రాగల శక్తి ఎవరికి ఉండును? నన్ను తీసుకు వెళ్ళగల శక్తి నీకు వున్నదని తెలిసికొనుచున్నాను. మహాత్ములు అలోచించి తప్పక కార్యసిద్ధిని పొందెదరు. ఓ కపిశ్రేష్ఠా అనఘా! కాని నీతో వెళ్ళుట యుక్తము కాదు. వాయువేగము కల నీ వేగముతో నాకు స్పృహ పోవచ్చును. సాగరము పై ఆకాశములో వేగముగా పోవుచూ నీ పృష్ఠమునుంచి భయముతో పడిపోవచ్చును. తిమిరములు మొసళ్ళతో నుండు సాగరములోపడి ఆ జలచరములకు ఉత్తమమైన అన్నము అయిపోదును'.

'ఓ శత్రువులను వినాశనము చేయువాడా! నీతో వచ్చుట మంచిది కాదు. కళత్రవతిని అగు నన్నుతీసుకుపోవుటలో నీకు మొప్పు కలగవచ్చు. తీసుకుపోబడుతున్న నన్ను చూచి భయంకరమైన పరాక్రమము కల రాక్షసులు దురాత్ముడైన రావణునిచేత ఆజ్ఞాపింపబడిన వారై నిన్ను అనుసరించెదరు. ఓ వీరుడా శూలములు ముద్గరములు చేతిలో పట్టుకొని వున్న ఆశూరులచేత చుట్టబడి నువ్వు నా రక్షణలో సంశయములో పడెదెవు. ఆ ఆకాశములో సాయుధులైన అనేకమంది రాక్షసులతో నువ్వు నిరాయుధవుడుగా వారితో పోరాడుతూ నన్ను రక్షించడము ఎట్లు చేయగలవు. ఓ కపిసత్తమ కౄరకర్మలు చేయు రాక్షసులు నీతో యుద్ధము చేయునపుడు భయముతో నేను నీ పృష్ఠమునుంచి పడిపోవచ్చును. ఓ కపిసత్తమ ! భయంకరులు మహత్తరమైన బలముకల రాక్షసులు ఎదోవిధముగా నిన్ను జయించవచ్చు'.

' లేక యుద్ధములో మునిగియున్న నీకు తెలియకుండా పడిపోయిన నన్ను పాపులైన రాక్షసులు తీసుకొని పోవచ్చు. నీ హస్తములనుంచి నన్నుతీసుకొనిపొవచ్చు లేక నన్ను హతమార్చవచ్చు. యుద్ధములో జయాపజయములు పరాధీనము కదా . ఓ హరిశ్రేష్ఠ! రాక్షసులచేత అవమానమునకు గురి అయి నేను ప్రాణత్యాగము చేసినచో నీ ప్రయత్నము విఫలము అగును'.

' నీవు రాక్షసులనందరినీ హతమార్చుటకు శక్తి కలవాడివి అయిననూ రాక్షసులు నీచే హతమార్చబడినచో రాముని కీర్తికి భంగము కలుగును. లేక రాక్షసులు నన్ను మరల తీసుకొనిపోయి వానరులు రామలక్ష్మణు లకు తెలియని ప్రదేశములో దాచిఉంచవచ్చు. అప్పుడు నా కోసమై మొదలిడిన కార్యక్రమము భంగపడును. నీతో కలిసి రాముడు ఇక్కడికి వచ్చుటయే మహత్తరమైన గుణములు కల పని. ఓ మహాబలుడా ! మహాత్ముడైన రాముడు ఆయన సోదరులు నీ రాజుల జీవితము నా జీవితముపై నిలబడి వున్నవి. నా కోసము శోకసంతాపములలో నున్న రామలక్ష్మణులు వానరగణములు నిరాశపడి ప్రాణములు త్యజించవచ్చు'.

' ఓ వానరపుంగవా! భర్తపై భక్తితో రాముని తప్ప వేరొకని శరీరము స్పృశించను. నేను బలాత్కారముగా తీసుకురాబడి వివశురాలైనప్పుడు నా అవయవములు తాకబడినవి. అప్పుడు నాధుడులేని నేను ఏమి చేయగలను. రాముడు దశగ్రీవుని బాంధవులతో సహా హతమార్చి నన్ను ఇక్కడనుంచి తీసుకొని పోవుటయే రామునకు సముచితముగా నుండును'.

' రణములో శత్రువులను మర్దించు మహాత్ముడు రాముని పరాక్రమము వినటమే కాక చూడడముకూడా అయినది. దేవ గంధర్వ భుజంగ రాక్షసులలో ఎవరూ రామునితో సమానులు కారు. వాయువు తో కలిసి ప్రజ్వరిల్లు అగ్నివలే ఉండు , లక్ష్మణునితో కలిసి చిత్రమైన ధనస్సు ధరించి ఇంద్రునితో సమానమైన విక్రమము కల రామునితో యుద్ధములో ఎవరు నిలబడగలరు? ఓ వానరోత్తమా! లక్ష్మణునితో కూడి సూర్యకిరణములభాతి శరపరంపరలతో తేజరిల్లు మత్తగజములా యుద్ధములో నిలబడియున్నరాముని ఏ యోధుడు ఎదురుకొనగలడు?'

' ఓ వానరోత్తమా ! లక్ష్మణునితో కూడి వానరసమూహముల సమేతముగా రాముని ఇక్కడ తీసుకు రమ్ము. ఓ వానర ముఖ్యుడా ! రాముని చూచుటకై శోకములో నున్న నాకు ఆనందము కూర్చుము'.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది ఏడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

స మే హరిశ్రేష్ఠ స లక్ష్మణం పతిం
సయూధపం క్షిప్ర మిహోపపాదయ|
చిరాయ రామం ప్రతి శోకకర్శితామ్
కురుష్వ మాం వానరముఖ్య హర్షితాం||66||

స|| హరిశ్రేష్ఠ సః సలక్ష్మణం సయూథపం పతిం క్షిప్రం ఇహ ఉపపాదయ | వానరముఖ్య రామం ప్రతి చిరాయ శోకకర్శితాం మాం హర్షితాం కురుష్వ||
తా|| ' ఓ వానరోత్తమా ! లక్ష్మణునితో కూడి వానరసమూహముల సమేతముగా రాముని ఇక్కడ తీసుకు రమ్ము. ఓ వానర ముఖ్యుడా ! రాముని చూచుటకై శోకములో నున్న నాకు ఆనందము కూర్చుము'.
||ఓమ్ తత్ సత్||